Read more!

సీతమ్మ ఎదుట రావణుడి మాయ!

 

సీతమ్మ ఎదుట రావణుడి మాయ!

రామసైన్యం గురించి చెప్పమని అడగగానే సారణుడు ఎంతో పొంగిపోతూ రావణాసుడికి వివరించి చెప్పాడు. ఆ తరువాత ఇంకా ఏదో చెప్పబోయిన సారణుడిని ఆపి "నీకు అంత సంతోషంగా ఉందా వాళ్ళ గురించి చెప్పడం అంటే. నా అన్నం తిని వాళ్ళని పొగుడుతావా. ఇంకొకళ్ళు అయితే ఇప్పుడే పీకలు తీయించేవాడిని, కాని మీరు నాకు గతంలో చాలా సహయాలు చేశారు కనుక వదిలేస్తున్నాను. ఇంకెప్పుడన్నా మీ ముఖాలు నాకు కనపడితే మీ పీకలు ఎగిరిపోతాయి, పోండి ఇక్కడినుండి" అని వాళ్ళను పంపేసాడు.

ఆ తరువాత మళ్ళి శార్దూలుడిని పిలిచి "ఈ సారి నువ్వు వెళ్ళి గూఢచర్యం చేసి, ఎవడు ఏ వంశానికి చెందినవాడు, ఎవడు ఎవడి పుత్రుడు, రాముడు ఆహారం ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, పక్కన ఎవరుంటారు, ఎవరు రక్షిస్తూ ఉంటారు మొదలైన ఈ విషయాలని కనిపెట్టి రా" అని పంపించాడు.

శార్ధూలుడిని పంపిన తరువాత  రావణుడు విద్యుజిహ్వుడిని పిలిచి "నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నువ్వు గొప్ప మాయాజాలం ఉన్నవాడివి. రాముడి శరీరం నుండి శిరస్సు విడిపోతే ఆ శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అటువంటి శిరస్సు తయారుచెయ్యాలి. రాముడి చేతిలో ఎటువంటి కోదండం ఉంటుందో అటువంటి కోదండాన్ని సృష్టించాలి, అలాగే రాముడి బాణాలు, అక్షయతుణీరాలు ఎలా ఉంటాయో అటువంటివి సృష్టించాలి" అని చెప్పాడు. విద్యుజిహ్వుడు రావణుడు చెప్పినట్టే చేసాడు.

అప్పుడు రావణుడు అశోక వనానికి వెళ్ళి "సీత! నా భర్త ఎంతో గొప్పవాడు అని గొప్పగా చెప్పావు కదా, ఆ రాముడు వానరములతో కలిసి సముద్రానికి సేతువు కట్టి దాటాడు. రాముడు దక్షిణ తీరంలో లంకకి సమీపంగా పడుకొని ఉండగా, ప్రహస్తుడి నాయకత్వంలో సైన్యం వెళ్ళి ఆదమరచి నిద్రిస్తున్న రాముడి శిరస్సుని శరీరం నుండి వేరు చేశారు. నిద్రపోతున్న వానరముల మీద మా సైన్యం దాడి చేసి అందరినీ సంహరించారు. హనుమంతుడు దవడల నుండి రక్తం కక్కుతూ చనిపోయాడు. రాముడి శిరస్సు వేరవడం చూసి లక్ష్మణుడు దిక్కులుపట్టి పారిపోయాడు. జాంబవంతుడు, సుషేణుడు, గంధమాదనుడు, శతబలి, అంగదుడు మొదలైన వీరులందరూ మరణించారు. మిగిలిన వానరాలని సముద్రంలోకి తోసేసారు. లక్ష్మణుడు మాత్రం కొంతమంది వానరములతో కలిసి పారిపోయాడు. ఇదుగో నీ భర్త శిరస్సు చూసుకుని సంతోషించు" అని చెప్పాక, అక్కడున్న ఒక రాక్షస స్త్రీని పిలిచి "రాత్రి ప్రహస్తుడు రాముడి శిరస్సుని వేరు చేసి తీసుకొచ్చాడు. విద్యుజిహ్వుడిని ఆ శిరస్సు తీసుకురమ్మన్నానని చెప్పండి" అన్నాడు.

అప్పుడు విద్యుజిహ్వుడు తీసుకొని వచ్చిన రామ శిరస్సుని, బాణాలని, కోదండాన్ని అక్కడ పెట్టారు. వాటిని చూడగానే సీతమ్మ నేల మీద పడి మూర్చపోయింది. అప్పుడు రావణుడు ఆ కోదండాన్ని, బాణాలని సీతమ్మ దగ్గరికి విసిరేసి "సీత! ఇప్పటికైనా నువ్వు నా పాన్పు చేరుతావ" అన్నాడు.

అప్పుడు సీతమ్మ ఆ శిరస్సుని పట్టుకొని రాముడిదో కాదో అని పరిశీలించి  చూసింది. అది  రాముడి శిరస్సులానే అనిపించింది. అప్పుడు సీతమ్మ "రామ! నాకు చాలా సౌభాగ్యము ఉందని, నువ్వు దీర్ఘాయిష్మంతుడవని పెద్దలు, జ్యోతిష్కులు చెప్పారు. ఇవ్వాళ ఆ జ్యోతిష్కులు చెప్పిన మాట అబద్దమయ్యింది. నువ్వు గొప్ప యజ్ఞాగ్నితో అంతిమ సంస్కారం జరుపుకోవలసినవాడివి, కాని ఇవ్వాళ దిక్కులేకుండా యుద్ధ భూమిలో పడిపోయి ఉంటే క్రూరమృగాలు నీ శరీరాన్ని తినేస్తు ఉంటుంటాయి. భార్యలో దోషం ఉంటే, భార్య ప్రవర్తన తప్పుగా ఉంటే భర్త వెళ్ళిపోతాడని శాస్త్రం చెబుతుంది. నాలో ఏ దోషముందని నాకన్నా ముందు వెళ్ళిపోయావు రామ"అని సీతమ్మ ఏడ్చింది.

                                        ◆నిశ్శబ్ద.